- పెద్దపల్లి జిల్లాలో 5 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయం
- ప్రపోజల్స్ రెడీ చేసి రెండేండ్లయినా డీపీఆర్ రెడీ చేయలే..
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిధిలో పత్తిపాక రిజర్వాయర్‌నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి రెండేళ్లయినా ఇంకా పనులు మొదలుకాలేదు. రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రభుత్వం రిజర్వ్‌లో పెట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వాయర్నిర్మాణం కోసం డీపీఆర్రెడీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సీడబ్ల్యూసీకి అనుగుణంగా డీపీఆర్ తయారు చేయాలని ఆదేశిస్తూ గతేడాది ఫండ్స్ కూడా కేటాయించారు. కానీ ఇప్పటివరకు డీపీఆర్ కూడా రెడీ పూర్తికాలేదు.
సాగునీటికి ఎదురుచూపులే.
గత సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని పెద్దపల్లి జిల్లాలోని ఎస్సారెస్పీ కింద ఉన్న ఆయకట్టు భూములకు నీరందించాలనే ఆలోచనతో రిజర్వాయర్నిర్మాణం చేయాలనుకుంది. దానికోసం ధర్మారం మండలం పత్తిపాక వద్ద రిజర్వాయర్ నిర్మించాలని గత సర్కార్ ప్లాన్ చేసింది. దానికోసం ఎన్ని టీఎంసీల సామర్థ్యంతో కట్టాలనే దానిపై కచ్చితమైన నిర్ణయానికి రాలేదు.
దీంతో పత్తిపాక నిర్మాణం మూలనపడిపోయింది. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా సర్కార్ ఏర్పాటైన వెంటనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పత్తిపాకపై క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో జిల్లా మంత్రితో కలిసి ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు రిజర్వాయర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి డీపీఆర్ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.
కానీ ఇప్పటిదాకా నిర్మాణానికి ముందడుగు పడలేదు. గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా పత్తిపాకకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటించలేదు. దీంతో జిల్లా రైతుల్లో మరోసారి ఆందోళన మొదలైంది. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ఎదురుచూపులు తప్పడం లేదు.
టేల్ఎండ్ రైతులకు సాగునీరు
పత్తిపాక రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి జిల్లాలోని 2.40 లక్షల ఎకరాలతోపాటు, జగిత్యాల జిల్లా వెల్గటూర్, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని 40 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ కానుంది. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి, మంథని, రామగుండం మండలాల్లోని టేల్ఎండ్లో మరో 10 వేల ఎకరాల సాగునీరు అందే చాన్స్ ఉంది.

